'కాలా హిరణ్'... సల్మాన్ జింకల వేట, లారెన్స్ బిష్ణోయ్ తో వైరంపై సినిమా

  • మరోసారి వార్తల్లోకి సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసు
  • క్రైమ్ థ్రిల్లర్, కోర్ట్‌రూమ్ డ్రామాగా 'కాలా హిరణ్'
  • జూన్ 20న టీజర్‌ విడుదల
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ కేసు ఆధారంగా తెరకెక్కుతున్న ‘కాలా హిరణ్’ అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్రం సల్మాన్ ఖాన్, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మధ్య ఉన్న వైరాన్ని ప్రధానంగా చూపిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా గురించి నిర్మాత అమిత్ జానీ మాట్లాడుతూ.. "1998లో జోధ్‌పూర్‌లోని కకానీ గ్రామంలో జరిగిన కృష్ణ జింక వేట కేసు, ఆ తర్వాత నడిచిన కోర్టు డ్రామా, సల్మాన్ ఖాన్‌కు, లారెన్స్ బిష్ణోయ్‌కు మధ్య నెలకొన్న తీవ్రమైన వైరాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్, కోర్ట్‌రూమ్ డ్రామాగా సాగుతుంది" అని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్, మొరాదాబాద్ వంటి నగరాల్లో ఈ సినిమా షూటింగ్ జరిపినట్టు ఆయన వివరించారు.

అప్పట్లో సల్మాన్‌తో పాటు సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, సతీష్ షా వంటి నటులు కూడా ఉన్నారని, వేట జరిగిన తీరు, సల్మాన్ అరెస్ట్, శిక్ష వంటి అంశాలను ఈ సినిమాలో ప్రస్తావించినట్టు నిర్మాత పేర్కొన్నారు. బిష్ణోయ్ వర్గానికి చెందిన ప్రజలు కృష్ణ జింకలను పవిత్రంగా భావిస్తారు. ఈ కారణంగానే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్‌ను లక్ష్యంగా చేసుకుంది. అక్టోబర్ 2024లో సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని ముంబైలో కాల్చి చంపినప్పుడు, ఆ దాడికి బాధ్యత తమదేనని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకోవడం గమనార్హం.

ఈ పరిణామాల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. జూన్ 20న ‘కాలా హిరణ్’ టీజర్‌ను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది.

Salman Khan
Kala Hiran
Lawrence Bishnoi
Blackbuck poaching case
Bollywood
Crime thriller
Courtroom drama
Jodhpur
Gangster

More Telugu News